కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి మీరేనా? అని ప్రశ్నించిన మీడియా.. క్లారిటీ ఇచ్చేసిన కేటీఆర్!

  • రాజకీయాల్లో వారసత్వం పాస్ లాంటిదే
  • ప్రజల మద్దతు సంపాదించుకోకుంటే కష్టమే
  • మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ వెల్లడి
రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాస్ లాంటిదేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఓసారి రంగంలోకి దిగాక మనల్ని మనం నిరూపించుకోవాల్సి ఉంటుందనీ, ప్రజల మద్దతును సంపాదించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాననీ, నాలుగు ఎన్నికలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ; బీజేపీ నుంచి అమిత్ షా, మోదీ ప్రచారం నిర్వహించినప్పటికీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే తెలంగాణ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈ రోజు నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి మీరేనా? అన్న ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ..‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ తరఫున రాష్ట్రమంతా పర్యటించా. రాష్ట్రం సాధించుకున్నాక సిరిసిల్ల నుంచి ప్రజామోదంతో గెలుపొందా. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంత్రిగా తన కేబినెట్ లో ఓ అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులను సమయాత్తం చేసి అప్పట్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం. దీంతో తాజాగా నాకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని అప్పగించారు. భవిష్యత్ ఇచ్చే ఏ బాధ్యతను అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని తెలిపారు.
Go Back to Shorts
Telangana
TRS
KTR
next cm
meet the press
Hyderabad

More Telugu News